జగన్ నిర్ణయాలతో హీటెక్కిన ఏపీ పాలిటిక్స్.. ఎవరి సీటుకి ఎసరుపడుతుందోననే టెన్షన్లో వైసీపీ నేతలు
సంక్షేమం ఒక్కటే తనను వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించదని భావించిన జగన్ అనేక రకాలుగా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకు టికెట్లు ఇచ్చి దెబ్బతిన్నారు. సిట్టింగ్‌ల మీద ప్రజా వ్యతిరేకతతో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఇలాంటి ఫలితాలు ఎదురుకాకుండా సిట్టింగ్‌లను మార్చాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు టాక్. సుమారు 40 నుంచి 50 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే తొలిదశలో 11 నియోజకవర్గాలలో ఇంఛార్జులను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్న జగన్.. ఎమ్మెల్యేల స్థానాలను మార్చడం ద్వారా వారిపై ఉన్న ప్రజావ్యతిరేకతను తగ్గించవచ్చని ఆలోచిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ అధినేత జగన్ అన్ని రకాల వ్యూహాలను రచిస్తున్నారు. సంక్షేమం ఒక్కటే తనను వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించదని భావించిన ఆయన గెలుపు కోసం అనేక ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా పార్టీ గుర్తుపైనే ఓటు పడేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొద్దినెలలుగా వైసీపీ శిబిరంలో అలజడి మొదలైంది. పార్టీ నేతలకు గుబులు పట్టుకుంది. 175 సీట్లే టార్గెట్‌గా.. క్లీన్ స్వీప్ దిశగా జగన్ ఎత్తుగడలతో ఎవరి సీటుకి ఎసరుపడుతుందోననే ఆందోళనతో వైసీసీ నేతలు టెన్షన్లో పడ్డారు. అయితే అంతా అనుకున్నట్టే.. జగన్ నిర్ణయాలతో ఏపీ రాజకీయాలు మాత్రం హీటెక్కాయని చెప్పుకోవాలి.
ఓ వైపు మార్పులు చేర్పులతో జగన్ వ్యూహాలు రచిస్తుండటంతో వింటర్ సీజన్లోనూ వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి. ఇక పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్.. సిట్టింగ్‌లను నమ్ముకుంటే కేసీఆర్‌లా నట్టేట మునగడం ఖాయమనుకున్నారో ఏమో నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను మార్చే పనిలో పడ్డారు. ఈ ఎత్తుగడలో భాగంగానే ఒక్కసారే 11 నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను మార్చారు జగన్. అయితే నియోజకవర్గాలు మార్చిన సిట్టింగ్‌లు అక్కడ నెగ్గుకురాగలరా అనే డౌట్ పార్టీ నేతల్లో క్రియేట్ అవుతోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అసలు పాత నియోజకవర్గంలోనే క్యాడర్‌ను పట్టించుకోనివారు.. కొత్త ప్లేస్‌లో ఎలా మెప్పు పొందుతారంటూ అంతర్గత చర్చకు దారి తీస్తోంది. మంత్రులు విడదల రజినీ, నాగార్జున, సురేష్‌లు కొత్త చోట్ల తీరు మార్చుకుంటారా లేక క్యాడర్‌ను చేరదీస్తారా అనే చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలు పైకి అధినేత మాటే శిరోధార్యం అంటూనే లోలోపల ఆందోళనలో ఉన్నారా అనే చర్చ ఏపీ పాలిటిక్స్‌లో నడుస్తోంది.