కొక్కొరొకో…కాలు దువ్వుతున్న పందెం కోళ్లు
సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది పందెం కోళ్లు. సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండగ. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగలో అనేక విశిష్టతలున్నప్పటికీ సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా గుర్తుకొచ్చేది కోడి పందేలు. పందెం కోళ్లు కాలు దువ్వుతుంటే మీసం మీద మెలేసిన చేయి దించరంతే. కోడిపందేలకు ఉభయ గోదావరి జిల్లాలు ప్రసిద్ధి. ప్రత్యేకంగా ఇందుకోసం బరులను తయారు చేస్తారు.
ప్రస్తుత సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలు అనే విధంగా ట్రెండ్ మారిపోయింది. సంక్రాంతి పండుగకు జరిగే కోడిపందాలు చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి సైతం వస్తున్నారంటే కోడి పందాలకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండుగ మూడు రోజులు కోడిపందాల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. ఈ క్రమంలో పందెం రాయుళ్లు తమ కోళ్లను రణరంగంలో దింపడానికి సిద్ధం చేశారు. పందెం పుంజులు తోపాటు పందాలు వేసే బరులు సిద్ధమయ్యాయి.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ కోడిపందేలకు హాజరవుతారు. కోడిపందేలు చూడకపోతే పండగ పూర్తి కానట్టేనని భావిస్తారు. అందుకే సంక్రాంతి పండగ వేళ జరుగుతున్న కోడి పందేల కోసం వేల సంఖ్యలో జనం ఎదురు చూస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందేల కోసం ఏడాదంతా కోడి పుంజులను బరిలోకి దింపేందుకు సన్నద్ధం చేస్తుంటారు. వాటికి బలిష్టమైన ఆహారం ఇవ్వడంతో పాటు వివిధ రకాల ఎక్సర్సైజులు కూడా చేయిస్తారు. స్విమ్మింగ్ కూడా చేయిస్తారు. పందెం కోళ్లను సిద్ధం చేయడానికి ప్రత్యేకంగా కొందరిని నియమించుకుంటారు. వేల రూపాయలు జీతాలిచ్చి వీరిని అందుకోసమే వినియోగిస్తారు. ఈ పందేలలో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి.
అనకాపల్లి నుంచి అమెరికా వరకూ సంక్రాంతి సంబరాలే పోలీసుల అనుమతి లేకున్నా… పోలీసుల అనుమతి అధికారికంగా లేకపోయినా.. అనధికారికంగా ఏటా జరుగుతూనే ఉంటాయి. ఈసారి సంక్రాంతి పండగకు మరొక ప్రత్యేకత ఉంది. ఎన్నికల ఏడాది కావడంతో పార్టీల వారీగా బరులను ఏర్పాటు చేస్తున్నారు. ఏ పార్టీకి చెందిన అభిమానులు, కార్యకర్తలు ఆ బరుల వద్దకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఈ పందేలను చూసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తుంటారు.
కోనసీమ కోడిపందేలకు ప్రసిద్ధి. శాసనసభ ఎన్నికలు జరుగుతుండటంతో ఈసారి సంక్రాంతికి కోడి పందేల బరులు పెద్ద సంఖ్యలో ఉండే అవకాశాలున్నాయి. బరులను ఏర్పాటు చేయడమే కాదు.. ఎక్కడ ఏ బరి ఉంది? అక్కడ ఏ సౌకర్యాలున్నాయన్న దానిపై సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం మొదలయింది. ఫుడ్ దగ్గర నుంచి అన్ని రకాలుగా వినోదాలను బరుల దగ్గర సిద్ధం చేస్తున్నారు. దీంతో సంక్రాంతి పండగకు ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లే వారికి సులువుగా సమాచారం లభిస్తుంది. ఇప్పటికే భీమవరం, ఏలూరు వంటి నగరాల్లో ప్రధాన లాడ్జీలన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. పందెంరాయుళ్లు ఈ మూడు రోజులు అదే పనిలో ఉంటారు. పందెం కాయడమే కాదు… గెలవడమూ ముఖ్యమే… అన్ని రకాలుగా ఎంజాయ్ చేయడానికి ఉభయ గోదావరి జిల్లాలు రెడీ అయ్యాయి.